కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వైపీ రమణారెడ్డి బదిలీ అయ్యారు. ఈయనను అనంతపురం జిల్లా టూరిజం, సాంస్కృతి క శాఖ అధికారిగా నియమించారు. పంచాయతీ రాజ్‌లో డివిజినల్ డెవలఫ్‌మెంటు అధికారి(డీఎల్‌డీవో) అయిన రమణారెడ్డి దాదాపు రెండేళ్లుగా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన రిక్వెస్ట్‌పైనే అనంతపురం జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారిగా డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. ఈ పోస్టులో ఈయన ఏడాది పాటు కొనసాగుతారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో మంగళవారం ఆర్‌టీ నెంబరు 545 జారీ చేశారు.
పీఆర్ ఈఈగా శివ సాగర్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న జీ శివసాగర్‌రెడ్డికి పదోన్నతి కల్పించి కర్నూలు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఈగా నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ స్పెష ల్ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్త ర్వులు జారీ చేశారు. కర్నూలు పీఆర్ ఈఈగా విధులు నిర్వహించిన ఎస్ మహేశ్వరరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు పాణ్యం డీఈఈ నాగిరెడ్డి ఇన్‌చార్జ్ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి పదోన్నతి
రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది డీఈఈలకు ఈఈ లుగా పదోన్నతి కల్పించి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఈఈలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి ఈఈలుగా పదోన్నతి కల్పించారు. ఈఈలుగా పదోన్నతి పొందిన వారిలో ఈ అశ్వత్థామను తాడేపల్లిలోని ఆర్‌డీ కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై నియమించారు. అలాగే కే నాగరాజును కందుకూరుకు, డీ లక్ష్మినారాయణను మచిలీపట్నానికి, కేఎస్‌ఆర్ మోహన్‌రావును జమ్మలమడుగుకు, ఈ భాస్కర్‌ను భీమవరానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తేనెటీగల దాడి
మహానంది: మహానంది సమీపంలోని ఎంసీ ఫారంలో ఉన్న వ్యవసాయ కళాశాల వద్ద మంగళవారం తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కళాశాల వద్ద విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీకి సంబంఽధించి బ్యానర్ విడుదల చేస్తున్న సమయంలో టపాసులు పేల్చడంతో కళాశాల ప్రాంగణంలోని చెట్టుపై ఉన్న తేనె తుట్టె నుంచి తేనెటీగలు చెల్లాచెదురై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఎంసీ ఫారం గ్రామానికి చెందిన జయమ్మ, శేఖర్‌తో పాటు మరికొందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించినట్లు స్థానికులు వెల్లడించారు.
గంజాయి పట్టివేత
నందవరం : పెద్దకొత్తిలి పంచాయతీ పరిధిలోని సంజీవపురం గ్రామ సమీపంలో ఉన్న కొత్త కాలనీలో గంజాయి పట్టుబడింది. సమాచారం మేరకు భం భం స్వామి ఆశ్రమం వద్ద ఉన్న ఇంటిలో పోలీసులు తనిఖీ చేసి 5.300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని చాకలి రాముడు, చాకలి నాగరాజుతో పాటు మిట్టసోమపురం గ్రామానికి చెందిన తిప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, ఎస్‌ఐ తిమ్మారెడ్డి, ఆర్‌ఎస్‌డీటీ మహేష్‌కుమార్, మండల వ్యవసాయ అధికారిణి సరిత పంచనామా నిర్వహించారు.
చికిత్స పొందుతూ
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు: మద్యం అతిగా సేవించి అనారోగ్యానికి గురైన గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. బళ్లారి చౌరస్తా ఆటోస్టాండ్ సమీపంలో గల కాలువలో గుర్తు తెలియని వ్యక్తిని డ్రైవర్లు గుర్తించి రెండు రోజుల క్రితం 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఈ వ్యక్తి నీలం, బూడిద రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. పొట్టకు ఎడమ వైపు, కుడివైపున పుట్టుమచ్చలు ఉన్నాయి. మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 91211 01062కు ఫోన్ చేసి సమాచారం అందించాలని నాలుగో పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు లక్ష్మీనగర్‌లోని గ్రీన్ పార్కు బార్ అండ్ రెస్టారెంట్ ముందు కేసీ కెనాల్ గట్టుపై అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉండి 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. మంగళవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహం కుడి ఎదపైన, కుడి తొడకు నల్లటి పుట్టుమచ్చలు ఉన్నాయి. నీలపు గీతలు గల నలుపు రంగు ఫుల్ షర్టు, నలుపు జీన్స్ ప్యాంటు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 9121101061కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మూడో పట్టణ సీఐ శేషయ్య కోరారు.


