● పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్
ఓర్వకల్లు: చింతలపల్లె గ్రామం వద్ద నెలకొల్పనున్న డ్రోన్ పరిశ్రమ మూడు దశల్లో పూర్తవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు. చింతలపల్లె, పాలకొలను గ్రామాల వద్ద ఏపీఐఐసీ వారు సేకరించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతలపల్లె గ్రామం వద్ద దాదాపు 300 ఎకరాలలో నెలకొల్పనున్న డ్రోన్ పరిశ్రమను మొదట 150 ఎకరాలల్లో అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం 100 ఎకరాల్లో, పిదప 50 ఎకరాలో పరిశ్రమను పూర్తి చేయాలని తెలిపారు. అంతకు ముందు ముచ్చుమర్రి గ్రామం వద్ద ఓర్వకల్లు జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమకు నీటి సరఫరా చేసే పైపులైన్ నిర్మాణ పణుల పురోగతి గూర్చి సంబంధిత ఇంజినీర్లతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ సందీప్‌కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదమా.. డయల్ 101
కర్నూలు: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే డయల్ 101కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఎన్.అవినాష్ జయసింహ తెలిపారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు కర్నూలు నగరం ఫైర్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీ వరకు వివిధ రూపాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి డీటీసీ శాంతకుమారి, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అవినాష్ జయసింహ, స్టేట్ ట్రైనింగ్ సెంటర్ జిల్లా అగ్నిమాపక అధికారి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అగ్నిప్రమాదాల పట్ల అవగాహనకు అగ్నిమాపక శాఖ ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు పాల్గొన్నారు.
వైభవంగా వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు చేశారు. వసంత మంటపంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదులకు నవకలశాలతో, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 108 కలశాలతో తిరుమంజనం సేవ నిర్వహించారు.
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను నేడు(బుధవారం) విడుదల చేయనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి గత నెల 24వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 26,473 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,491 మంది హాజరయ్యారు. గత నెల 2వ తేది నుంచే కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం గత 21వ తేదిన మొదలై.. ఈ నెల 9వ తేది వరకు కొనసాగింది. జిల్లాకు ఫస్ట్ ఇయర్, ద్వితీయ సంవత్సరానికి చెందిన సమధాన పత్రాలు మొత్తం 2,41,217 వచ్చాయి. పరీక్షల ఫలితాలు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయ నున్నారు. ఫలితాల కోసం https:// resultsbie.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 95523 00009 అనే నెంబరుకు Hi అని పెడితే ఫలితాలు తెలుసుకునే వీలుంది.


