ఉమ్మడి జిల్లాలో 19,577 కేసుల పరిష్కారం
కర్నూలు(హాస్పిటల్): జాతీయ లోక్ అదాలత్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జి.కబర్ధి ఆద్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 19,577 కేసులు పరిష్కారమయ్యాయి. 197 మోటార్ ఆక్సిడెంట్ కేసుల్లో రూ.6,34,62,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ మొత్తం రెండు జిల్లాల్లో 28 బెంచీలను ఏర్పాటు చేసి 284 సివిల్ కేసులు, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులు, 19,096 క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడవ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీ రాజ్యం, కర్నూలు బార్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామానాయుడు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పాల్గొన్నారు.


