దిగువకు 383.7 టీఎంసీల నీరు
కర్నూలు సిటీ: సుంకేసుల జలాశయం నుంచి జూన్ నెల నుంచే ఇప్పటి వరకు జల వనరుల శాఖ గణాంకాల ప్రకారం 383.7 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో టీబీ డ్యాం గేట్లు ఖరీఫ్ సీజన్‌కంటే ముందుగానే తెరుచుకున్నాయి. నదికి వచ్చిన వరద నీటితో సుంకేసుల జలాశయం గేట్లు ఇప్పటి వరకు తెరుచుకునే ఉన్నాయి. జలాశయం నుంచి కేసీ కెనాల్ ఆయకట్టుకు 17.33టీఎంసీలు, కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని జనాభాకు 1.7 టీఎంసీల నీటిని వినియోగించారు. ప్రస్తుతం నదిలో 17,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇదిలా ఉండగా గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఈ ఏడాది హంద్రీ నదికి 9 టీఎంసీలకుపైగా నీటి ని వదిలారు. ప్రస్తుతం హంద్రీనదిలో 250 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.
ప్ర‘జల’ కష్టాలు కనిపించవా?
ఆలూరు: ‘మంచినీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ప్రజల కష్టాలు కనిపించవా’ అని అధికారులపై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరులో అధికారులతో ఆదివారం వారు సమావేశమయ్యారు. జిల్లాలోనే తాగునీటి సమస్య ఆలూరులో ఎందుకు ఉందని ప్రశ్నించారు. వచ్చే తాగునీటిని కూడా ప్రజలకు సక్రమంగా పంపింగ్ చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గ్రామపంచాయతీ అధికారులను హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పద్మావతి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మల్లికార్జునయ్య పాల్గొన్నారు.


