సిబ్బంది లేక ఇబ్బంది!
నివేదిక పంపాం
● గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వహణకు 14 మంది అవసరం ● ఉన్నది నలుగురు మాత్రమే
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బంది లేపక అధికారులకు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఆరుగురు లస్కర్లు, ఆరుగురు టెక్నికల్ సిబ్బంది, ఇద్దరు నైట్ వాచ్‌మెన్‌లు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు లస్కర్లు, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో సిబ్బంది ఎంతో అవసరం అవుతుంది. సిబ్బంది లేకపోవడంతో రాత్రి పగలు ఉన్న నలుగురితోనే పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ దుస్థితి..
ప్రాజెక్టుకు గత రెండు నెలలుగా వరద నీరు వస్తోంది. గత నెల 12వ తేదీ నుంచి నేటి వరకు 30 సార్లు గేట్లు ఎత్తి నీటిని హంద్రీ నదికు విడుదల చేశారు. అత్యవసరం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ముగ్గురి వ్యక్తులను కాంట్రాక్ట్ కింద ఏర్పాటు చేసుకున్నారు. వారు నవంబర్ నెల చివరి వరకు మాత్రమే పనిలో ఉంటారు. ఉన్న ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు కూడా మరో మూడేళ్లకు రిటైర్డ్ అవుతారు. ఇక నియామకాలు జరగకపోతే మూడేళ్లకు ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది ఒక్కరు కూడా ఉండరు.
సమస్యలు ఇవీ..
ప్రాజెక్టు నిర్వహణకు క్రస్ట్‌గేట్లకు వేసేందుకు గ్రీస్, ఇతర అవసరాలకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కాని నిధులను విడుదల చేయడం లేదు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారులే సొంత నిధులతో గ్రీస్‌ను, ఇతర అవసర పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టులో సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రాజెక్టు విద్యుత్ బిల్లు కూడా దాదాపు రూ.30 లక్షల మేర పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
గాజులదిన్నె ప్రాజెక్టుకు సిబ్బంది కొరత ఉంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సిబ్బంది కొరత ఉందని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– మహమ్మద్ ఆలీ, ప్రాజెక్టు ఏఈ


