● భక్తులకు భద్రత కరువు
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాఽశాల నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి అమాయక భక్తులు తొమ్మిది మంది మృతి చెందారన్నారు. సినిమా థియేటర్ల వద్ద పోలీసులను నియమించే కూటమి ప్రభుత్వం దేవాలయాల వద్ద ఎందుకు భద్రత కల్పించలేదని విమర్శించారు. పవిత్ర తిరుపతిలో లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం వల్లే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం దేవాలయం వద్ద తొక్కిసలాటలో ఏడుగురు అమాయక భక్తులు మృతిచెందారన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పార్టీ నాయకులు నరసింహులు, యాదవ్, ప్రభాకర్, కార్పొరేటర్ రాజేశ్వర రెడ్డి, పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.


