సాంకేతిక వి‘పత్తి’
● పత్తి కొనుగోళ్లలో సర్వర్ సమస్యలు ● పరిష్కరించని మార్కెటింగ్ శాఖ ● ఇబ్బంది పడుతున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు సర్వర్ సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సర్వర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. పత్తి దిగుబడులు మొదలైన మూడు నెలల తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే 50 శాతం దిగుబడులను తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోయారు. మిగిలిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశనే మిగులుతోంది.
‘యాప్’సోపాలు
పత్తి కొనుగోళ్ల సాఫీగా జరుగాలంటే మూడు యాప్‌లు బాగా పనిచేయాల్సి ఉంది. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. యాప్‌లేవీ పనిచేయకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ–పంట యాప్‌లో రైతులు ఏ పంట.. ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఉంటాయి. సీఎం యాప్‌లో రైతుల ఆధార్, మొబైల్ నంబరు నమోదు చేస్తే ఈ–పంట యాప్‌లోని వివరాలు డిస్‌ప్లే కావాల్సి ఉంది. సీఎం యాప్‌లో ఈ–పంట యాప్‌లోని వివరాలు డిస్‌ప్లే కాకపోవడంతో రిజిస్ట్రేషన్‌లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కపాస్ కిసాన్ యాప్‌లో రైతులు స్లాట్ బుక్ చేసుకుంటారు. పత్తి పంటను ఏ తేదీలో.. ఏ కొనుగోలు కేంద్రానికి తీసుకెల్లాలనేది వస్తుంది. అయితే ఏ యాప్ పనిచేయకపోవడంతో ఒకవైపు రిజిస్ట్రేషన్‌లు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఎకరాకు 6 క్వింటాళ్లే కొనుగోలు..
స్లాట్ బుకింగ్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు సగటు దిగుబడి ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. సీసీఐ మాత్రం ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పత్తిని దళారీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో కొనుగోలు కేంద్రంలో రోజుకు 2,500 క్వింటాళ్లు కొనాల్సి ఉన్నప్పటికీ అరకొరగా కొనుగోలు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దిగుబడి మొత్తం కొనేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు మార్కెటింగ్ శాఖను, సీసీఐ అధికారులను కోరుతున్నారు.


