మున్సిపల్ కాంట్రాక్టర్ల తిరుగుబాటు
● ఇద్దరు చేస్తున్న దందాపై ఆగ్రహం ● నూతన అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం
కర్నూలు (టౌన్): నగరంలో మున్సిపల్ కాంట్రాక్టర్ల తిరుగుబాటు చేశారు. కాలం చెల్లిన కాంట్రాక్టర్ల అసోసియేషన్ పేరుతో అధికారుల వద్ద పైరవీలు చేయడాన్ని వ్యతిరేకించారు. కొత్తగా కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. మెజార్టీ మున్సిపల్ కాంట్రాక్టర్లు ఓ ప్రెవేటు హోటల్‌లో సమావేశం కానున్నారు. ఇప్పటికే అదిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఏడేళ్ల క్రితం గడువు ముగిసినా....
గ్రేటర్ కర్నూలు కాంట్రాక్టర్ల అసోసియేషన్ 2015 మార్చి 10న ఏర్పాటైంది. ఇద్దరు మాత్రమే నాయకులుగా చెలామణీ అవుతున్నారు. ఇతరులను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇద్దరు మాత్రమే అభివృద్ధి చెందారు. బిల్లుల నుంచి పనుల వరకు వారే అధికారుల వద్ద వారే పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అసోసియేషన్ సమావేశం నిర్వహించాలి. నూతనంగా కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ అసోసియేషన్ గడువు 2018 మార్చి 9 వ తేదీ నాటికి ముగిసింది. ఇప్పటి వరకు అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించలేదు.
4న నూతన అసోసియేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం
కర్నూలు కార్పొరేషన్‌లో 110 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరిలో 90 మందికి పైగా కాంట్రాక్టర్లు విసుగు చెంది కొత్తగా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇతర కాంట్రాక్టర్లతో చర్చించారు. దాదాపు అందరూ కాంట్రాక్టర్లు ఒప్పుకోవడంతో ఈనెల 4న కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని ఓ హోటల్‌లో సమావేశం కానున్నారు. అదే రోజు కొత్తగా మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు వెల్లడించారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 శాతం మంది కాంట్రాక్టర్లు ఆంగీకారం తెలిపారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు, బిల్లుల పెండింగ్, తీవ్ర జాప్యంతో పాటు పలు సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.


