మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (టౌన్): మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నందున మండలాల్లో, గ్రామాల్లో చిన్నపాటి గొడవలు జరుగకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. అవసరం అయితే పీడీ యాక్ట్‌లు నమోదు చేయాలన్నారు. ప్రధాని పర్యటనలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈగల్ టీమ్ క్యూర్ కోడ్‌ను అవిష్కరించారు. అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, క్రిష్ణ మోహన్, లీగల్ ఆడ్వైజర్ మల్లిఖార్జునరావు, డిఎస్పీలు బాబు ప్రసాద్ పాల్గొన్నారు.


