ఎన్‌సీసీతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు సిటీ: విద్యార్థి దశలో ఎన్‌సీసీలో చేరితే క్రమ శిక్షణతో పాటు, శారీరక ఆరోగ్యం మెరుగై ఉజ్వల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తుందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఎన్‌సీసీలో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎన్‌సీసీ 28 ఆంధ్ర బెటాలియన్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ శశికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపిక ప్రక్రియకు ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి ఉన్నత విద్యలోనూ, పోలీసు శాఖ, త్రివిధ దళాల ఉద్యోగాల ఎంపికలోనూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాలేజీ నుంచి 60 మందికి అవకాశం ఉంటే 75 మంది పోటీ పడ్డారన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ 28వ ఆంధ్రా బెటాలియన్ పురుషుల ఆఫీసర్ డాక్టర్ ఎ బంగారుబాబు, ఎన్‌సీసీ ఆఫీసర్ జక్తర్ సింగ్, పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
11 నుంచి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు
కర్నూలు టౌన్: చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని నవంబర్ 11, 12 తేదీల్లో కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్ (బాల బాలికలు), హ్యాండ్‌బాల్ (బాలబాలికలు), ఫుట్‌బాల్ (బాలురు), బాస్కెట్‌బాల్ (బాలికలు), రగ్బీ (బాల బాలికలు), చెస్ (బాల బాలికలు), రైఫిల్ షూటింగ్ (బాల బాలికలు) తదితర క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే ఆయా స్కూళ్ల జట్ల వివరాలను నవంబర్ 7లోపు పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు 93938–27585 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


