75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుగ్రాసాల సాగుకు మొక్కజొన్న, జొన్న విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విత్తనాలు 5 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు మొక్కజొన్న విత్తనాలు 10 టన్నులు, జొన్న విత్తనాలు 10 టన్నుల ప్రకారం కేటాయించారన్నారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ పూర్తి ధర రూ.340 ఉండగా.. సబ్సిడీ రూ.255 ఉంటుందని.. రైతులు రూ.85 చెల్లించాలన్నారు. జొన్న 5 కిలోల ప్యాకెట్ ధర రూ.460 ఉండగా.. సబ్సిడీ రూ.345 ఉంటుందని.. రైతులు రూ.115 చెల్లించాలని సూచించారు. ఏక వార్షిక విత్తనాలైన జొన్న, మొక్కజొన్న విత్తనాలను అన్ని పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.
జగనన్న కాలనీవాసులకు పక్కా ఇళ్లు లేవు
ఆలూరు: జగనన్న కాలనీవాసులకు పక్కా ఇళ్లు మంజూరు చేయలేమని ఆలూరు హౌసింగ్ డీఈ జె.విజయ్‌కుమార్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో ఆలూరులో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక హౌసింగ్ డీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐ సర్వే ద్వారా పక్కాగృహాలను మంజూరు చేయాలని ఉన్నతాధికారులు నుంచి తమకు ఉత్తర్వులను అందాయన్నారు. నవంబర్ 5 నాటికి పక్కాగృహాలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాలంటే అందుకు గ్రామ సచివాలయంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


