రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మిడ్తూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కొందరు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా పాణ్యం మండలంలోని ఎస్ కొత్తూరు శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి దర్శనానికి ఆటోలో చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని తిరిగి ఆటోలో వెళ్తుండగా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడగా అందులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వీపనగండ్ల గ్రామానికి చెందిన బోయ సరస్వతి (55), మహేశ్వరమ్మకు తీవ్ర గాయాలు కావడంతో 108లో కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. అప్పటికే సరస్వతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్‌ఐ ధనుంజయ.. గాయపడిన ఆటో డ్రైవర్ బోయ రాఘవేంద్ర, లక్ష్మీదేవి, గౌతమ్‌నంద, లక్ష్మీదేవి, మద్దమ్మ, షేక్ షరీఫాబీ, షేక్ రేష్మా, పవిత్ర, శ్యామల, షేక్ రిజ్వాన్, రాణి, కె. భవ్యశ్రీని నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి సరస్వతికి భర్త సుంకన్న, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.


