రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
● మూడో రోజు 14 కేసుల నమోదు
● రూ.72 వేలు జరిమానా,
రూ.96 వేల పన్నులు వసూలు
కర్నూలు: కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు విస్తృతం చేసి నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా మీదుగా నిత్యం 200కు పైగా ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటాయి. హైదరాబాద్, బెంగుళూరు, చైన్నె, తిరుపతి, విజయవాడ, షిర్డీ వంటి ప్రాంతాలకు నిత్యం ట్రావెల్స్ బస్సులు కర్నూలు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు వెయ్యి మందికి పైగానే రోజు ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్దం ఘటన నేపథ్యంలో రవాణా అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు విస్తృతం చేశారు. ఘటన జరిగిన మొదటి రెండు రోజుల్లో 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.42 లక్షల జరిమానా విధించగా, 3వ రోజు శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తనఖీలు కొనసాగాయి. సుమారుగా 50కి పైగా వాహనాలను తనిఖీలు చేసి 14 బస్సులపై ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇందుకు గాను రూ.72,050లు జరిమానా విధించి, పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న వాహనాల నుంచి రూ.96 వేలు వసూలు చేశారు. తనిఖీల సందర్భంగా అనేక లోపాలు బయట పడ్డాయి.
ప్రధాన ఉల్లంఘనలు ఇవే ...
నిబంధనలకు విరుద్ధంగా సరుకులను అనధికారికంగా రవాణా చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రమాదకర వస్తువులను సైతం లగేజీ రూపంలో అనుమతిస్తున్నారు. ఇవే ప్రమాద తీవ్రతకు కారణమవుతున్నాయి. ఫైర్ అలారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మంటలను అర్పే యంత్రాలు ఉండడం లేదు. ప్రథమ చికిత్స కిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉండక పోవడం, వాణిజ్య సరుకు రవాణా, పన్నుల ఎగవేత, సీట్లు ఆల్ట్రేషన్ చేయడం వంటి లోపాలు గత మూడు రోజులుగా బయట పడుతున్నాయి. తనిఖీల సందర్భంగా అధికారులు వాహన పర్మిట్లు, పన్నులు, ఎఫ్‌సీలు, బస్సుల్లో అత్యవసర ద్వారాలు, వాహన రికార్డులు వంటివి పరిశీలించి ఉల్లంఘనలు ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ – బెంగుళూరు, కర్నూలు – కడప జాతీయ రహదారులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ మార్పు, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయా, లేదా అని పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్ బస్సులకు ఒరిజినల్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, పరిమితికి మించి లగేజీ రవాణా, డ్రైవర్ల లైసెన్స్ గడువు ముగియడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. మూడో రోజు అగ్నిమాపక పరికరాలు లేని ఆరు బస్సులపై కేసులు నమోదు కాగా, ఎమర్జన్సీ డోర్ లేని ఒక బస్సు పైన పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు బస్సులు, పన్ను చెల్లించకుండా తిప్పుతున్న ఒక బస్సు, కిటికీ అద్దాలు సక్రమంగా లేకుండా ఉన్న మరో ఐదు బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి. లేకుంటే అపరాధ రుసుం విధించడంతో పాటు బస్సును సీజ్ చేస్తాం, రహదారి భద్రతపై డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఉల్లంఘనలకు పాల్పడితే ఉపేక్షింది లేదు. తనిఖీలు నిరంతరాయంగా సాగుతాయి.
– శాంతకుమారి, డీటీసీ


