సంక్షేమ హామీ ‘ఔట్’
కర్నూలు(అగ్రికల్చర్): ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చాలీచాలని వేతనాలతో వీరు సతమతం అవుతున్నారు. ‘ మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయనే విషయం తెలుసు.. వేతనాలు అతి తక్కువగా ఉన్నాయి.. రేషన్ కార్డులు ఇస్తాం..కుటుంబంలో అర్హత కలిగిన వారు ఉంటే పింఛన్లు ఇస్తాం.. సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తాం’ అని ఎన్నికల సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టీడీపీ ఆధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అవుతున్నా హామీ అమలు కాలేదు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై ఒక్క డీఏ ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్ విధానాన్ని తెచ్చిన సీఎం చంద్రబాబు వారి సమస్యల గురించి పట్టించుకోలేదు.
ఇవీ కష్టాలు..
పొరుగు సేవల కార్పొరేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 6,500 మంది ఉన్నారు. ఇతరత్రా మరో 3,500 మంది ప్రకా రం దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఆఫీసు సబార్డినేట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్, టైపిస్ట్‌లు గా పనిచేస్తున్న వారందరూ ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులయిన వారే. ఆఫీసు సబార్డినేట్లకు నెలకు రూ.12000, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు నెలకు రూ.16 వేల వేతనం వస్తోంది. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నా.. ఏ ఒక్క నె ల కూడ 1వ తేదీ వేతనాలు ఇవ్వలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి నెలా రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే మూడు నాలుగు రోజులు ఆలస్యంగా వేతనాలు పొందుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపైనే పని భారం ఎక్కువగా ఉంది. ఇటీవలనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్డు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అ మలు చేయాల్సిన బాద్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నప్పటికీ స్పందన లేకుండా పోయింది. ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులు అనారోగ్య కారణాలతో లేదా ప్రమాదవశాత్తు మృతిచెందితే ఆ కుటుంబాన్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. కారుణ్య నియామకాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింప చేయడం లేదు.
‘పోషక్’ హీనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2014 నుంచి పోషక్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ఐసీడీఎస్ ద్వారా అమలు అవుతోంది. ఈ కార్యక్రమం కింద జిల్లా కో ఆర్డినేటర్, అసిస్టెంటు కో–ఆర్డినేటర్, ప్రాజెక్టు వారిగా బ్లాక్ కో–ఆర్డినేటర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. 2014లో ఉన్న వేతనాలే.. ఇప్పటికీ ఉన్నాయి. 11 ఏళ్లు అవుతున్నా.. వేతనాల్లో ఒక్క రూపాయి కూడా పెరుగుదల లేకుండా పోయింది. ఐసీడీఎస్ కార్యక్రమాలన్నీ వీరి ద్వారానే అమలు అవుతున్నాయి. వీరికి పీఆర్‌సీ ప్రయోజనాలు లేవు. ప్రతి ఏటా 3 శాతం వేతనం పెంచాల్సి ఉంది. ఈ విషయం నియామక ఉత్తర్వుల్లోనే ఉంది. కాని పోషక్ అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు.
వైఎస్సార్‌సీపీ హయాంలో గౌరవం
వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో తొలుత ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే వేతనాలు చెల్లించేవారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చొరువ కారణంగా రెగ్యులర్ ఉద్యోగుల కంటే ముందుగా వేతనాలు పొందేవారు. పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి విముక్తులను చేశారు.
టీడీపీ పాలనలో దుస్థితి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే మూడు నాలుగు రోజులు ఆలస్యంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు పొందుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు జీవనాడిగా ఉన్న పొరుగు సేవల కార్పొరేషన్‌ను రద్దు చేసి గత టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్నే మళ్లీ తీసుకరావడానికి కసరత్తు జరిగింది. దీనిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందుకు ఏకమై వ్యతిరేకించడంతో రద్దు చేస్తే తిరుగుబాటు వస్తుందని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పటి వరకు పొరుగు సేవల కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టలేదు. ఈ కార్పొరేషన్‌తో సంబంధం లేకుండానే వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఈ ఉద్యోగాలను టీడీపీ నేతలు అమ్మకానికి పెట్టినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు
సంక్షేమ పథకాలు అమలు చేయలేదు
చాలీచాలని వేతనాలతో సతమతం
పోషక్ అభియాన్ ఉద్యోగుల పరిస్థితి
మరింత దారుణం
శ్రమ దోపిడీ!
ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఉంటే వీరికి పింఛన్ల అర్హత కూడా లేకుండా పోయింది.
వీరికి డీఏలు ఉండవు. పీఆర్‌సీ ప్రకటించినపుడు మాత్రమే వేతనాల్లో కొంత పెరుగుదల ఉంటుంది. పీఆర్‌సీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీకి పాల్పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


