రైతుల అభ్యున్నతికి పట్టుదలతో పనిచేస్తాం
● జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ పథకాల పకడ్బందీ అమలుకు పట్టుదలతో పనిచేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. శనివారం జాయింట్ డైరెక్టర్ హోదాలో జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉమ్మడి జిల్లాలో జేడీఏగా, విభజన తర్వాత జిల్లా వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించారు. ఇటీవలనే ఈమెకు జాయింట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్‌గా పదోన్నతి లభించింది. డీడీఏ బాధ్యతలు అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్‌కు అప్పగించి జేడీఏ హోదాలో జిల్లా వ్యవసాయ అధికారిగా విధుల్లో చేరారు. జేడీఏగా పదోన్నతి పొందిన జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మిని అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, ఏవోలు అల్లీపీర, రాఘవేంద్ర, ఉషారాణి, మణిమాలిక, శారదమ్మ తదితరులు అభినందించారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు.
వైద్య విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు శివారు నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని వెంకటాద్రి నగర్‌లో నివాసముంటున్న రఘునాథ రెడ్డి కూతురు బొమ్మిరెడ్డి గిరిజ (25) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మహారాష్ట్రలో పీజీ చదువుతోంది. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు రెండు రోజుల క్రితం కర్నూలుకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి కిందకు దింపి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఆలూరు: అభివృద్ధి చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆలూరు నియోజకవర్గ అబ్జర్వర్ గుండం ప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆలూరు మండలం మొలగవెల్లి, హత్తిబెళగళ్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఉల్లి, టమాట, మిర్చికి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతుల దయనీయ పరిస్థితిని పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు పరిశ్రమలు వస్తున్నాయని అబద్ధాలు చెబుతున్నారన్నారు.
మృతులకు సంతాపం
చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రైవేట్ బస్సు దగ్ధమై 19 మంది ప్రయాణికులు మృతి చెందగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపం తెలిపారు. గ్రామ సభల్లో రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి, పార్టీ పరిశీలకులు గడ్డం ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్రరెడ్డి, నాయకులు అనిల్‌రెడ్డి, రంగన్న, చిన్న ఈరన్న, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు (టౌన్): క్రీడలతో మానసిక ఆరోగ్యం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ అండర్–14, అండర్–17 విభాగాల్లో ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రికెట్‌లో ప్రతిభ చాటి ఎంతో మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్‌లో సీట్లు సంపాదించారన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి క్రిష్ణ, ఎస్‌జీఎఫ్ సభ్యులు శేఖర్, పరమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


