రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
● 12 ప్రైవేటు ట్రావెల్స్‌పై కేసులు నమోదు
● రూ.2.42 లక్షల జరిమానా
కర్నూలు: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతకుమారి పర్యవేక్షణలో రెండు రోజులుగా మోటర్ వాహన తనిఖీ అధికారులు (ఎంవీఐ, ఏఎంవీఐలు) బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నట్లు బయటపడిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. కర్నూలులో బెంగుళూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు బస్సులకు సక్రమంగా రికార్డులు లేకపోవడం, ఏడు ట్రావెల్స్ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేనట్లు గుర్తించారు. అలాగే ఒక బస్సుకు ఎమర్జెన్సీ బటన్స్, అలారం పనిచేయకపోవడం, మరో బస్సుకు ఎమర్జెన్సీ డోర్ పనిచేయకపోవడం, ఒక బస్సుకు పర్మిట్ లేకపోవడం, పన్ను చెల్లించకుండా తిప్పుతున్న మరో బస్సుపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ శాంతకుమారి తెలిపారు. రెండు బస్సులు షీల్డ్ గ్లాసులు (అద్దాలు) లేకుండా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.2.42 లక్షలు జరిమానా విధించినట్లు డీటీసీ వెల్లడించారు.


