జిల్లా అంతటా ‘మోంథా’ అప్రమత్తం
కర్నూలు(సెంట్రల్): మోంథా తుపాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. కలెక్టరటేలోని కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మండల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 27వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. నదీతీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మునిసిపల్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, పీఆర్, ఆర్‌అండ్‌బీ, ఆరోగ్యశాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నార. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సుంకేసుల రిజర్వాయర్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల బండ్స్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, హాస్టళ్లలో ముందస్తుగా విద్యార్థులను మరో ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన వైద్య బృందాలను ఏర్పాటు చేసుకొని వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు.


