పోలీసు అమరవీరుల త్యాగాలను మరవద్దు : ఎస్పీ
కర్నూలు(అగ్రికల్చర్): పోలీసు అమరవీరుల త్యాగాలను మరువకుండా ఆయా కుటుంబాలకు అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అమరవీరుల ఇళ్లను పోలీసు అధికారులు సందర్శించి ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించారు. వారోత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కుమార్ రాజు హెబ్బటం గ్రామంలో 2008లో అమరుడైన బీఎస్‌ఎఫ్ జవాన్ రామాంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈనెల 31వ తేదీ వరకు అమరవీరుల గ్రామాల సందర్శన, చర్చా వేదికలు, వక్తృత్వ పోటీలు, పోలీసు త్యాగాలు, పరాక్రమ చిత్రాల ప్రదర్శన, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఏర్పాటుచేసి.. 31న సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.


