మలుపులో రెండు వాహనాలు ఢీ
● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
● మూడు గంటలకుపైగా
ట్రాఫిక్‌కు అంతరాయం
కొలిమిగుండ్ల: బెలుం గుహల సమీపంలో ఉన్న మలుపుల వద్ద బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..హైదరాబాదు నుంచి భారీ వాహనం ఐరన్ షీట్లు తీసుకొని కల్వటాల సమీపంలోని రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి బయలు దేరింది. గుహల వద్దకు చేరుకోగానే అదే సమయంలో రామాపురం వైపు వెళుతున్న లారీ బలంగా ఢీకొంది. లారీ డ్రైవర్ రాజేష్ తీవ్రగాయాల పాలయ్యాడు. ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు, తోటి వాహనదారులు అతి కష్టం మీద అతడిని బయటకు లాగి చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరువైపుల నుంచి వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన చోట బైక్‌లు మినహా ఇతర వాహనాలు పోయేందుకు అవకాశం లేక పోవడంతో మూడు గంటలకు పైగానే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోరుగా వర్షం కురవడంతో వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ, హైడ్రా వాహనాలను పిలిపించి ప్రమాదానికి గురైన లారీని రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


