‘మీ డబ్బు – మీ హక్కు’ను ప్రజల్లోకి తీసుకెళ్లండి
నంద్యాల: ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి. నరసింహారావు, ఎల్‌డీఎం రవీంద్ర కుమార్, యూనియన్ బ్యాంక్ నూనెపల్లె బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జున, డీఈఓ, కేజీబీవీ ప్రిన్సిపాల్ తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు. ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటున్నారని, అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆస్తులు పరిపక్వతకు వచ్చిన తర్వాత లబ్ధిదారులకు చేరకపోవడానికి ఖాతాదారుల మరణం, చిరునామా మార్పు, లేదా నామినీ వివరాల లోపం వంటి కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు..మీ హక్కు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అనంతరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నంద్యాల జిల్లాలోని 27 కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలకు ఒక్కొక్క పాఠశాలకు ఒకటి చొప్పున మొత్తం 27 కంప్యూటర్లు అందజేశారు.


