విద్యుత్ ఉచ్చు కేసులో నిందితుల అరెస్ట్
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు రూరల్ సర్కిల్ పరిధిలోని బానకచర్ల – బానుముక్కల గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం పన్నిన విద్యుత్ ఉచ్చు తీగ తగిలి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ కృష్ణ నాయక్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిలైన మిడ్తూరు మండలం తలముడిపికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు, పాములపాడు మండలం వేంపెంటకు చెందిన మాదారం సుభాష్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం స్థానిక జేఎఫ్‌ఎంసీ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి వారికి 15 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు ఆత్మకూరులోని అటవీశాఖ కార్యాలయంలో డీఎస్పీ రామాంజి నాయక్ విలేకరులతో మాట్లాడి కేసు వివరాలు వెల్లడించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు సురేష్ కుమార్ రెడ్డి, రాము, ఎస్‌ఐ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


