వదలని వర్షం.. తీరని నష్టం
కోవెలకుంట్ల: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లోని దొర్నిపాడు మండలంలో అత్యధికంగా 20.4 మి.మీ, అవుకు మండలంలో 15.2 మి.మీ, కోవెలకుంట్ల మండలంలో 12.4 మి.మీ, ఉయ్యాలవాడ మండలంలో 14.4 మి.మీ, సంజామల మండలంలో 10 మి.మీ, కొలిమిగుండ్ల మండలంలో 5.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఆయా మండలాల వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతాన్ని అధికారులు నమోదు చేశారు. బుధవారం 10 గంటల నుంచి తిరిగి సబ్‌డివిజన్‌లో వర్షం ఆగకుండా కురుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఆయా మండలాల్లో రబీ సీజన్‌లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, మినుము, తదితర పంటల్లో వర్షపునీరు భారీగా చేరింది. రేవనూరు, కలుగొట్ల, లింగాల, తదితర ప్రాంతాల్లో జొన్న నీట మునిగింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టణ శివారులోని కుందూనదికి భారీగా వర్షపునీరు చేరడంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో రబీ పంటల సాగుకు ఆటంకం ఏర్పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొలిమిగుండ్ల: కొలిమిగుండ్ల,అవుకు మండలాల్లో మొక్కజొన్న, ఉల్లి, శనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల కొందరు రైతులు పంట కోత కోసి కల్లాలు,ఆరు బయట ప్రదేశాలు,రోడ్ల మీద ఆరబోసుకున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో దిగుబడులు తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో రెండు రోజులుగా
కురుస్తున్న వర్షాలు
నీట మునిగిన పంటలు
ఆందోళనలో రైతులు
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూనది
వదలని వర్షం.. తీరని నష్టం
వదలని వర్షం.. తీరని నష్టం


