జీపు బోల్తా.. తప్పిన ప్రమాదం
కోడుమూరు రూరల్: ఆస్పరి, గోనెగండ్ల మండలాల్లోని కై రుప్పల, బైలుప్పల పాఠశాలల్లో విధులు నిర్వహించే టీచర్లు 11మంది బుధవారం ఉదయం కర్నూలు నుంచి పాఠశాలలకు ఓ జీపులో బయలుదేరారు. అయితే, కె.నాగలాపురం, సల్కాపురం గ్రామాల మధ్య టైరు పేలడంతో జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు, ఇతర వాహనదారులు బోల్తా పడ్డ జీపులో నుంచి టీచర్లకు బయటకు లాగేశారు. అయితే, ఈ ప్రమాదంలో టీచర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా జీపు డ్రైవర్‌కు మాత్రం రక్తగాయాలయ్యాయి. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో టీచర్లంతా ఊపిరి పీల్చుకున్నారు.
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
దేవనకొండ: బైక్‌పై వెళ్తుండగా కింద పడి ఓ మహిళ దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ మండలం నలకలదొడ్డి గ్రామానికి చెందిన పింజరి ఫాతిమా (21) భర్త కాశీంతో కలిసి మంగళవారం మండలకేంద్రమైన దేవనకొండలోని బంధువుల పొలంలో పత్తి తీసేందుకు వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా కర్నూలు–బళ్లారి మార్గంలో బైకుపై నుంచి ఫాతిమా కింద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో భర్త 108కు ఫోన్ చేసి కర్నూలుకు తరలించారు. అక్కడ కోలుకోలేక మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి మామ పింజారి లాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు.
అమెజాన్, అమ్మకందారులపై నాన్ బెయిలబుల్ వారెంట్
కర్నూలు(సెంట్రల్): అమెజాన్, అమ్మకందారులపై కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పాటించని అమెజాన్‌తోపాటు అమ్మకందారులకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. సి. బెళగల్‌కు చెందిన కె.వీరేష్ 2024 సెప్టెంబర్ 29వ తేదీన అమెజాన్‌లో ఆపిల్ ఐ ఫోన్ ప్లస్‌ను రూ.79,900లకు కొనుగోలు చేశారు. అయితే ఆయన ఆర్డర్ చేసిన ఫోన్‌కు బదులుగా ఐ క్యూ నియో 9 ప్రోన్‌ను పంపడంతో బాధితుడు జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో అమెజాన్‌తోపాటు అమ్మకం దారులకు నోటీసులు ఇచ్చి బాధితుడికి రీప్లేస్ లేదా రూ.79,900లకు వడ్డీతో రిఫండ్ చేయాలని, రూ.25 వేల నష్టపరిహారం, రూ.10 వేల వ్యయ ప్రాయాసల కోసం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, 2025 ఆగస్టు 18వ తేదీ వరకు బాధితుడికి రిఫండ్, రీప్లేస్‌మెంట్ జరగకపోవడంతో తిరిగి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు జోక్యం చేసుకొని 2025 ఆగస్టు 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా అమెజాన్ పాటించలేదు. ఈ క్రమంలో బుధవారం జరిగిన వాయిదాల్లో కమిషన్ చైర్మన్ కరణం కిశోర్ కుమార్, ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి అమెజాన్‌తోపాటు ఇద్దరు అమ్మకం దారులకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను నంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు.
జీపు బోల్తా.. తప్పిన ప్రమాదం


