పశుబీమాకు మంగళం!
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి సర్కారు గతేడాది ఉచిత పంట బీమాకు మంగళం పాడగా ఇప్పుడు పశుబీమాకు ఎసరు పెట్టింది. ఇందులో భాగంగా అరకొరగా బడ్జెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పశునష్ట పరిహార పథకం, పశుబీమా పథకాలు విజయవంతంగా అమలు చేసి పశుపోషకులు, రైతులకు భరోసా ఇచ్చింది. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు పశువులకు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పశువుల విలువలు అపారంగా పెరిగాయి. అనారోగ్య కారణాలతో పశువులు మరణిస్తే రైతుకు చేకూరే నష్టం అంతా, ఇంతా కాదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పశునష్ట పరిహార పథకం, పశుబీమా పథకాలను అమలు చేసింది. తగిన మేర బడ్జెట్ ఇచ్చి ఏడాది పొడవునా పశుబీమాను ప్రోత్సహించింది. గత ప్రభుత్వం అమలు చేసిన పశుబీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పటికీ అరకొరగా బడ్జెట్ ఇస్తుండటంతో బీమా పథకం మూన్నాళ్ల ముచ్చట అయ్యింది. ఏడాది పొడవునా బీమా అమలు చేయడానికి బడ్జెట్ కనీసం రూ.50 లక్షలు అవసరమవుతుంది. 2024–25లో రూ.19 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఈ బడ్జెట్ నాలుగు నెలల్లోనే అయిపోయింది. 8 నెలల పాటు బీమా అమలు లేకుండా పోయింది.
ఈ ఏడాది ఇచ్చిన బడ్జెట్ రూ.11 లక్షలే
2025–26 సంవత్సరం మొదలై 7 నెలలు అవుతోంది. ఈ నెలల కాలంలో పశుబీమా పథకానికి విడుదల చేసిన బడ్జెట్ రూ.11లక్షలు మాత్రమే. ఈ మొత్తంతో 1,057 పశువులకు బీమా చేశారు. జాతి పశువులకు రూ.30 వేల విలువకు బీమా చేస్తారు. ప్రీమియం రూ.1,720 ఉండగా... సబ్సిడీ రూ.1,632 ఉంటుంది. రైతు రూ.298 భరించాల్సి ఉంది. నాటు పశువులకు రూ.15 వేల విలువకు బీమా చేస్తారు. ప్రీమియం రూ.965 ఉండగా.. సబ్సిడీ రూ.816 ఉంటుంది. రైతు రూ.149 భరించాల్సి ఉంటుంది. గొర్రెలు, మేకలకు రూ.6 వేలకు బీమా చేస్తారు. ప్రీమియం రూ.256 ఉండగా... సబ్సిడీ రూ.216 ఉంటుంది. రైతు రూ.40 చెల్లించాల్సి ఉంది. పశుబీమా అమలుకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో మూడు నెలలుగా బీమా నిలిచి పోయింది. మూడు నెలల కాలంలో వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. పశుబీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వ్యాధులతో పశువులు మరణించినప్పుడు కలుగుతున్న నష్టం అంతా.. ఇంతా కాదు. ఇప్పటికై నా కూట మి ప్రభుత్వం చొరవ తీసుకొని పశుబీమా అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఏడాదికి బడ్జెట్ రూ.50 లక్షలు
అవసరం
2024–25లో ఇచ్చిన నిధులు
19 లక్షలు
ఈ ఏడాది ఇచ్చిన బడ్జెట్ కేవలం
రూ.11 లక్షలే
మూడు నెలల నుంచి
పైసా ఇవ్వని వైనం


