కుట్రలు పన్ని.. ప్రలోభాలు ఎర వేసి!
● కూటమి నేతల కుయుక్తులతో వీగిపోయిన
వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం
ఆదోని రూరల్: మెజార్టీ లేకపోయినా కూటమి నాయకులు కుట్రలు పన్ని.. ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ స్థానాన్ని లాక్కున్నారు. అత్యధిక మంది ఎంపీటీసీలు కలిగిన వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం వీగిపోయింది. వైఎస్సార్‌సీపీ తరఫున నెగ్గి ఆదోని మండలం ఎంపీపీ (కపటి ఎంపీటీసీ)గా ఉన్న దానమ్మ బీజేపీలోకి చేరింది. దీంతో ఆమైపె మెజార్టీ సభ్యులు కలిగిన వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ప్రత్యేకాధికారి, సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు 16 మంది హాజరయ్యారు. అయితే కోరం కోసం 19 మంది ఎంపీటీసీలు లేరని అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పెషల్ అధికారి ప్రకటించారు. వాస్తవానికి ఆదోని మండలంలో 29 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, నాడు 26 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఇందులో 24 స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. తర్వాత ఇద్దరు ఎంపీటీసీలు చనిపోగా, ఒకరు రాజీనామా చేయడంతో మొత్తం 23 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురిని కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేసి లాక్కోగా.. బైచిగేరికి చెందిన ఎంపీటీసీ నాగభూషణంరెడ్డిని కిడ్నాప్ చేసిన విషయం పాఠకులకు విధితమే. దీంతో వారి సంఖ్య 7కు చేరింది. వైఎస్సార్సీపీకి 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరంతా బుధవారం అవిశ్వాస తీర్మాణంలో పాల్గొనేందుకు రాగా కోరం లేదని ప్రత్యేక అధికారి ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్దన్, తహసీల్దార్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


