కాసులిస్తే చాలు..
● సెలవురోజుల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సబ్‌జైల్ సిబ్బంది ఇష్టారాజ్యం
పత్తికొండ: పత్తికొండ సబ్ జైల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. కాసులిస్తే చాలు నిబంధనలు విరుద్ధంగా సెలవురోజుల్లోనూ ములాఖత్‌లకు అనుమతి ఇస్తున్నారు. ఇందుకు వేళాపాళా కూడా ఏమీ ఉండదు. నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారు కొందరు.. వివిధ కేసుల్లో ఆరైస్టె రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారు మరికొందరు స్థానిక సబ్‌జైలులో ఉన్నారు.వీరిని వారి కుటుంబసభ్యులు, బంధువులు ఎప్పుడంటే అప్పుడు కలవాడానికి వీలుండదు. నిర్దేశించిన రోజుల్లో నిర్ణయించిన సమయానికి కలవాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను ఇక్కడి జైలు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. రేటు ఫిక్స్ చేసి ములాఖత్‌కు అనుమతిస్తున్నారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుదరదని వెనక్కి పంపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జైల్ నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో ములాఖత్‌లకు అనుమతి ఇవ్వకూడదు. అయితే, దీపావళి పండుగ రోజైన సోమవారం ఏకంగా 20 మందికి అనుమతి ఇచ్చారు. పెద్ద మొత్తంలో వారి నుంచి డబ్బు ముట్టడంతోనే నిబంధనను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో సబ్‌జైలుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే జైల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాగా సెలవు రోజు ములాఖత్‌పై సబ్‌జైల్ అధికారి వెంకటయ్య వివరణ కోరగా రూల్స్ ప్రకారం అనుమతించరాదని ఖైదీలకు సంబంధించిన కుటుంబసభ్యులు అడగడంతో మానవతా కోణంలో అవకాశమిచ్చినట్లు చెప్పుకొచ్చారు.


