మా గ్రామంలో క్రికెట్ ఎలా ఆడతారు
కులం పేరుతో దూషిస్తూ దాడి
పోలీసుస్టేషన్ ఎదుట బాధితుల నిరసన
బేతంచెర్ల: మా గ్రామంలో క్రికెట్ ఎలా ఆడతారని మొదలైన గొడవ దాడికి కారణమైంది. దీంతో బాధితులు గ్రామస్తులతో కలిసి పోలీసుస్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ఘటన బేతంచెర్లలో చోటు చేసుకుంది. వివరాలివీ.. మండలపరిధిలోని బుగ్గానిపల్లె తండాకు చెందిన కిరణ్ నాయక్, పుల్లన్న నాయక్ మరికొందరు మిత్రులతో కలిసి దీపావళి పండుగ సందర్భంగా మండలంలోని సిమెంట్ నగర్ పాణ్యం సిమెంట్ హైస్కూలు గ్రౌండులో సోమవారం క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా మా గ్రామంలో మీకు ఆడేందుకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన అనిల్ నాయక్, రాజేష్ నాయుడు, సమీర్, లక్ష్మణ్ నాయక్, స్వామినాయక్ మరికొంత మంది యువకులు అడ్డుకున్నారు. వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా కిరణ్ నాయక్, పుల్లన్న నాయక్‌పై గొడవపెట్టుకొని క్రికెట్ బ్యాట్, వికెట్లతోదాడి చేశారు. ఆటను వీక్షించడానికి వచ్చిన మరికొంత మంది బుగ్గానిపల్లె తండా గ్రామస్తులు వారించిన వారిపైనా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధితులతో కలిసి పెద్ద ఎత్తున బేతంచెర్ల పోలీసుస్టేషన్‌కు చేరుకొని సమస్యను విన్నవించారు. పోలీసులు స్పందించకపోగా మీరు ఫిర్యాదు చేసి వెళ్లండని సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్ బాబు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ మేరకు అనిల్ నాయక్, రాజేష్ నాయుడు, సమీర్, లక్ష్మణ్ నాయక్, స్వామి నాయక్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపారు.


