పోలీసు అమరవీరులను
స్మరించుకోవడం మనందరి బాధ్యత
కర్నూలు: విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత.. వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. మంత్రి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ స్మృతి పెరేడ్‌కు హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలో ఈ సంవత్సరం ఐదుగురు ప్రాణత్యాగం చేశారన్నారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడుతూ నిజాయితీగా పనిచేస్తూ నేరాలు జరగకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. పోలీసులు నూతన టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారని, అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. ఏ ఘటన జరిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులేనని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 191 మంది పోలీసుల పేర్లను అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా చదివి వినిపించారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసులు వెంకటేశ్వర్లు, అబ్దుల్ కరీం, కె.రాముడు కుటుంబాల వారిని శాలువ, పూలమాలలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబు ప్రసాద్, ఉపేంద్ర బాబు, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజుతో పాటు పలువురు పోలీసు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసు అమరవీరులను


