డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతికళ బదిలీ
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ పి.శాంతికళ బదిలీ అయ్యారు. ఆమెను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్(సీఎంఓహెచ్)గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ కింద ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 27న కర్నూలు డీఎంహెచ్‌ఓగా ఆమె విధుల్లో చేరారు. వ్యక్తిగత కారణాలతో పలుమార్లు సెలవు పెడుతూ వచ్చారు. ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సైతం ఆమె అందుబాటులో ఉండటం లేదన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇదే సమయంలో జిల్లాలో భ్రూణహత్యలు, గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కోడుమూరులో కర్ణాటక రాష్ట్ర అధికారులతో ఏపీ వైద్యా రోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు బాషా నర్సింగ్‌హోమ్‌పై డెకాయిట్ ఆపరేషన్ ద్వారా దాడులు నిర్వహించి అక్కడ గర్భస్థలింగనిర్ధారణ చేస్తుండటాన్ని గమనించి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇదే సమయంలో డాక్టర్ పి.శాంతికళ తన కింది స్థాయి ఉద్యోగులపై పట్టు సాధించలేకపోవడం, జాతీయ కార్యక్రమాల అమలులో జిల్లా అట్టడుగుకు చేరుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె కూడా కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ కొనసాగింది. దీంతో మంగళవారం నాటి బదిలీ ఉత్తర్వులతో వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.
డాక్టర్ భాస్కర్‌కు ఎఫ్‌ఏసీ బాధ్యతలు
జిల్లా క్షయ నియంత్రణాధికారిగా, ఎయిడ్స్ అండ్ లెప్రసి అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎల్.భాస్కర్‌కు డీఎంహెచ్‌ఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డీఎంహెచ్‌ఓ వచ్చేంత వరకు ఆయన డీఎంహెచ్‌ఓగా కొనసాగనున్నారు. ఈ సీటు కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం.


