తూకం ప్రకారమే కూలి!
ఆలూరు: పొలంలో పత్తిని తీసేందుకు వచ్చిన కూలీలకు వారి తీసిన పత్తిని తూకం వేసి కూలి ఇస్తున్నారు. ప్రస్తుతం పత్తి కోతకు కూలీలను పిలిస్తే రోజుకు రూ.400 వరకు డిమాండ్ చేస్తున్నారు. అలా కాదంటే తాము తీసిన పత్తిని తూకం వేసి కిలోకు రూ.12 చెల్లించాలంటున్నారు. మొన్నటి వరకు కోస్తా, తెల్లంగాణ ప్రాంతాల్లో మాత్రమే ఈ పద్ధతి ఉండేది. ప్రస్తుతం ఈ విధానం జిల్లాకు వచ్చింది.
నేడు పోలీస్
పీజీఆర్‌ఎస్ రద్దు
కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్‌ను ఈ నెల 20న రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగ ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రావొద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, పోలీస్ కుటుంబాలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
గైనకాలజీ పీజీ సీట్లు పెరుగుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో గైనకాలజీ విభాగానికి మరో నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ విభాగంలో 18 పీజీ సీట్లు ఉండగా పెరిగిన నాలుగు సీట్లతో కలిపి 22కు చేరాయి.
ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్ ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 21వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ విశ్వనాథ్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 బాల బాలికలు టేబుల్ టెన్నిస్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నా మన్నారు. జిల్లా స్థాయి ఎలిజిబులిటీ ఫారం, ఎండీఎం ఫారం, సీబీఎస్‌ఈ విద్యార్థులు అయితే డిక్లరేషన్ ఫారం, ఆధార్ కార్డు జిరాక్స్, పుట్టిన తేదీ పాఠశాల రికార్డుతో హాజరు కావాలన్నారు.
వీరారెడ్డి ఇంట్లో సోదాలు
దొర్నిపాడు: వెల్త్ అండ్ హెల్త్ స్కీంలో భాగంగా దొర్నిపాడులో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల పేరిట మోసపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడు వీరారెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఆదివారం డీఎస్పీ ప్రమోద్ బృందం సోదాలు చేసింది. తనిఖీల్లో ప్రామీసరి నోట్లు, విలువైన ఆస్తి పత్రాలు, ప్రింటర్లు, ల్యాప్ టాప్‌లు దొరికినట్లు తెలిసింది. సమస్య పరిష్కారానికి రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరడంతో బాధితులు నిరసన విరమించారు. డీఎస్పీ వెంట సీఐలు మురళీధర్‌రెడ్డి, హనుమంత్‌నాయక్, ఎస్‌ఐలు రామిరెడ్డి, వరప్రసాద్ ఉన్నారు.
తూకం ప్రకారమే కూలి!


