పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలనే కుట్ర
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలనే కుట్రను సహించేది లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని పాతబస్తీ ప్రాంతంలో బేకారి కట్ట వద్ద కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించడమే కాకుండా, స్థానికంగా ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరితో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలన్న మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. రూ.8,500 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ఎలాగైనా తమ అనుచరులకు అప్పగించేందుకు ప్రెవేటీకరణ చేస్తోందన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పీపీపీ విధానాన్ని విరమించుకునేంత వరకు ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కార్పొరేటర్ జుబేర్, పార్టీ నాయకులు రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్, కిషన్, వస్తాద్, బాబుబాయ్, చాంద్, మైనార్టీ నాయకులు ఫిరోజ్, సర్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


