
ఆస్తి రాబట్టుకునేందుకు బాలుడి కిడ్నాప్
● 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
కర్నూలు: కర్నూలు రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ శివారు స్కందాన్షి వెంచర్‌కు చెందిన బాలుడు మోక్షిత్ (10) అదృశ్యం కేసు తెర పడింది. తెలుగు సురేష్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు మోక్షిత్ లక్ష్మీపురంలోని రామకృష్ణ విద్యా మందిర్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్‌ఐలు ధనుంజయ, శరత్ కుమార్ రెడ్డి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా బాలుడు ఇంట్లోనే నివాసమున్న వెల్దుర్తి మండలం మల్లెంపల్లె గ్రామానికి చెందిన మనోహర్ నాయుడు బాలుడి కుటుంబ సభ్యులను భయపెట్టి డబ్బులు, ఆస్తిని రాబట్టుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు బయటపడింది. మనోహర్ నాయుడు అదృశ్యమైన బాలుడు మోక్షిత్‌తో పాటు వెల్దుర్తి రైల్వే స్టేషన్ ఎదురుగా క్రిష్ణగిరి టర్నింగ్ వద్ద కర్నూలుకు వచ్చే దారిలో కారులో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తిని రాబట్టుకునేందుకు తానే కిడ్నాప్ చేసినట్లు మనోహర్ నాయుడు నేరాన్ని అంగీకరించాడు. శుక్రవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. సీఐ చంద్రబాబు నాయుడుతో కలసి డీఎస్పీ కిడ్నాప్ వ్యవహారం విషయాలను వెల్లడించారు. అదృశ్యమైన బాలుడిని 24 గంటల్లో వెతికిపట్టి తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు.