
ఫైనాన్షియర్ ఇంట్లో పోలీసుల సోదాలు
ఆదోని అర్బన్: పట్టణంలోని టీజీఎల్ కాలనీలో నివాసముంటున్న యోగేష్ అనే ఫైనాన్షియర్ ఇంట్లో శుక్రవారం త్రీటౌన్ పోలీసులు సోదాలు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సాయిబాబానగర్‌కు చెందిన బసవరాజుకు మండిగిరి పరిధిలో 3 ఎకరాల భూమి ఉంది. ఆయన అవసరాలకు స్థానిక టీజీఎల్ కాలనీలో నివాసముంటున్న సురేష్ శివలాల్ ఫైనాన్షియర్‌తో మూడు ఎకరాలు మార్ట్‌గేజ్ చేసి 2019లో రూ.1.80 కోట్లు రుణం తీసుకున్నాడు. అయితే ఆరు నెలల క్రితం సురేష్ శివలాల్ మృతి చెందాడు. బసవరాజు తన పొలాన్ని విడిపించుకోవడానికి వెళ్తే తన తండ్రికి అప్పుడే అమ్మేశావు కదా అని సురేష్ శివలాల్ కుమారుడు యోగేష్ చెప్పాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యోగేష్‌పై ఈ ఏడాది జూన్ 3వ తేదీన త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బసవరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నట్లు విచారణలో తేలడంతో శుక్రవారం డీఎస్పీ హేమలత అనుమతితో యోగేష్ ఇంట్లో తనిఖీ చేసినట్లు సీఐ తెలిపారు. యోగేష్ ఇంట్లో రిజిస్ట్రేషన్ పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించామన్నారు. తనిఖీలో ఎస్‌ఐ రామస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.