
ఎనిమిది నెలలుగా జీతాలు లేవు
హొళగుంద: తమకు ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదని, చాలా ఇబ్బందులు ఉన్నాయని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి దృష్టికి గ్రీన్ అంబాసిడర్లు తీసుకెళ్లారు. గ్రామానికి వచ్చే నిధుల్లో ముందుగా గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వాలని సెక్రటరీకి, సర్పంచ్‌కు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని మార్లమడికి గ్రామంలో జెడ్పీ సీఈఓ పర్యటించారు. గ్రామంలో బళ్లారి రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి శిథిలావస్థకు చేరిన గదులను వాడొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. ఐవీఎస్‌ఆర్ కాల్స్‌లో గ్రామానికి జీరో శాతం రావడంతో పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, పనులు ఎలా చేయాలని గ్రామ సర్పంచ్ తనయుడు రమేశ్ ప్రశ్నించారు. హొళగుంద ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలలిత, ఈఓపీఆర్డీ చక్రవర్తి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో జెడ్పీ సీఈఓ సమీక్ష నిర్వహించారు.