పత్తికొండ: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడే ప్రమాదం మాటు వేసింది. కిందకు వేలాడుతూ భయపెడుతోంది. వెలుగులు ప్రవహించే విద్యుత్ తీగలు చీకట్లు నింపే ప్రమాదం నెలకొంది. అయినా విద్యుత్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని కనిపిస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. పత్తికొండ పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఇరువైపుల ఏర్పాటు చేసిన సర్వీస్ విద్యుత్ తీగలు చాలా ప్రమాదకరంగా మారాయి.
వాహనాలకు తగిలే అంత ఎత్తులో ఉండటంతో ఏదో ఒక చోట తొగి కింద పడుతున్నాయి. త్రుటిలో ప్రజలు ప్రాణాలతో బయటపడుతున్నారు. గురువారం గుత్తిరోడ్డు సర్కిల్‌లో భారీ వాహనం తాకడంతో సర్వీస్ వైరు కిందికి పడిపోయింది. స్థానికులు విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ట్రాన్సోకో సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై ఆటోనే ఆసారాగా చేసుకుని 45 నిమిషాలు పాటు ట్రాఫిక్ నిలిపివేసి తీగలను సరి చేశారు. దీంతో ఇరు వైపులా వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.
ఆర్‌సీడీఎస్ రీజినల్ కోఆర్డినేటర్‌గా మండ్ల వెంకటసుబ్బారెడ్డి
కర్నూలు(అర్బన్): రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ(ఆర్‌సీడీఎస్) రీజినల్ కోఆర్డినేటర్(కర్నూలు, నంద్యాల, ప్రకాశం)గా బనగానపల్లెకు చెందిన డాక్టర్ మండ్ల వెంకటసుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డి గురువారం నియామక పత్రాన్ని జారీ చేశారు. రెడ్డి జాతి శ్రేయస్సు, ఐక్యతకు పాటు పాడేందుకు గత జూలై 30వ తేది నుంచి తదు పరి ఉత్తర్వులు అందే వరకు మండ్ల వెంకట సుబ్బారెడ్డి రీజినల్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సొసై టీ నియమ నిబంధనలను అనుసరించి క్రమ శిక్షణతో అన్ని రెడ్డి సంఘాలను సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలన్నారు.
2న చిత్రలేఖన పోటీలు
కర్నూలు కల్చరల్: జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభల సందర్భంగా ఈనెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఓల్డ్‌బస్టాండ్ సమీపంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. సీనియర్ విభాగంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ‘డార్విన్ జీవ పరిణామ సిద్ధ్దాంతం’, జూనియర్ విభాగంలో 6, 7 తరగతుల విద్యార్థులకు ’మొక్కల సంరక్షణ’ అనే అంశాలపై పోటీలు ఉంటాయని వెల్లడించారు.
రేపు ఆట్యా–పాట్యా ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): పాణ్యం పట్టణంలోని విజయానికేతన్ పాఠశాల క్రీడా మైదానంలో ఆగస్టు 2న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 బాలుర విభాగంలో ఆట్యా– పాట్యా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరత్నమయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చాటిన క్రీడాకారులు వచ్చే నెల 8 నుంచి 10 వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ప్రమాదం వేలాడుతోంది