
జర్మనీ భాష శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు(అర్బన్): జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలకు వీలుగా జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జర్మనీ భాషపై శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం డిగ్రీ అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 4లోగా dydir.sw.krnl@gmail.comకు పంపా లన్నారు. మరిన్ని వివరాలకు ఎం.శశికుమార్ (సెల్: 8121261727, 08518– 230790 )ను సంప్రదించాలన్నారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో మొత్తం 150 మంది మహిళలకు శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ముందుగా Naipunyam AP పోర్టల్‌లోని https://naipunyam.ap.gov.in/ user registration? pageprogaram regirtratio n, ఇందులో Traineeregistration ఎంపిక చేసి, ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అందుబాటులో ఉన్న శిక్షణా ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 6వ తేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు.
మూత‘బడి’
తుగ్గలి: మండలంలోని జాప్లాతండా ప్రాథమిక పాఠశాల మూతపడింది. గత విద్యా సంవత్సరం వరకు నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ముగ్గురు విద్యార్థులు పత్తికొండలో చేరగా రెండో తరగతి విద్యార్థిని ఒక్కరే మిగిలారు. దీంతో పాఠశాల మూతపడింది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు కూడా బదిలీపై వెళ్లారు. దీంతో ఉన్న ఒక్క విద్యార్థిని పక్కగ్రామమైన లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు చేర్పించారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే తిరిగి పాఠశాల తెరుచుకునే అవకాశం ఉందని ఎంఈవో–2 రామవెంకటేశ్వర్లు తెలిపారు.