జిల్లాలో రూ.133 కోట్ల ‘ఫీజు’ పెండింగ్
2023–24 ఏడాది పెండింగ్‌ను క్లియర్ చేయని రాష్ట్ర ప్రభుత్వం
ఎస్టీ ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు బుకాయింపు
ఫీజులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి
ప్రశ్నార్థకంగా మారిన పేద విద్యార్థుల ఉన్నత విద్య
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు చెల్లిస్తామని మాట ఇచ్చారు. మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా ఉంటాని వాగ్దానం చేశారు, అయితే అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మరిచారు. గడిచిన విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు (మొత్తం ఆరు క్వార్టర్లు) బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కర్నూలు(అర్బన్): వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో నిశ్చింతగా ఉన్న విద్యా రంగం కూటమి ప్రభుత్వంలో అతలాకుతలం అవుతోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆలవాలంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విడుదల చేయాల్సిన ఫీజు బకాయిలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను పీడిస్తున్నాయి. చాలా మంది పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు.
పెండింగ్‌లో మూడు క్వార్టర్ల ఫీజు
ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2న మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. అంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మూడు క్వార్టర్ల ఫీజును పెండింగ్‌లో పెట్టింది.
రూ.133.17 కోట్ల బకాయిలు
జిల్లాలో 2023–24, 2024–25 విద్యా సంవత్సరాలకు సంబంధించి దాదాపు రూ.133.17 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. 2023–24కు సంబంధించి 31,596 మంది విద్యార్థులకు మూడు నెలలకు రూ.61,86,61,526 కాగా, 2024–25 విద్యా సంవత్సరానికి 32,736 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు దాదాపు రూ.71,31,06,554లను ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. కాగా ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులకు మొత్తం ఫీజును చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ చెల్లించకపోవడం శోచనీయం.
ఐదేళ్లలో రూ.501.60 కోట్లు విడుదల
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచిన ఘనత వైఎస్ జగన్‌దే
గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజినీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్ –1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే కుటుంబ వార్షిక ఆదాయాన్ని కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. లక్షగా నిర్ధారిస్తే, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో ఉంచడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతాం.
– కటికె గౌతమ్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, రాష్ట్ర అధికార ప్రతినిధి
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజులను చెల్లించకపోవడంతో అనేక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాయి. ఫీజు గురించి విద్యార్థులను ప్రశ్నించకుండా కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఫీజుకు సంబంధించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగితే అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది.
– కాసారపు వెంకటేష్, మాల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు