
కోలాటం.. సంబరం
చాలా ఆనందంగా ఉంది
మా ఊర్లో అందరూ కోలాటం నేర్చుకుంటుంటే నేను నేర్చుకుంటానని మా అమ్మ, నాన్నను అడిగాను. వాళ్లు నాకు కోలాటం నేర్చుకునేందుకు మరింత ప్రోత్సాహం అందించారు. రోజూ ఇక్కడికి వచ్చి కోలాటం నేర్చుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. – రిషిత, ఒకటో తరగతి, బుక్కాపురం
మహానంది: పండుగలు, జాతరలు వస్తే గ్రామాల్లో సందడి కనిపిస్తుంది. పండుగలైనా, ప్రతిష్టలైనా జరిగితే కోలాటం నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అందులో ప్రధానంగా వినిపించే ‘బుజ్జి బుజ్జి గణపయ్యా.. బొజ్జ గణపయ్యా’, ‘శివుడే దేవుడని నేనంటే.. శివుడే దేవుడు కాదంటారు’. ‘రఘుకులతిలకా రారా..నిన్నెత్తీ ముద్దులాడెదరా’. ఇలా ఆధ్యాత్మిక పాటలతో భక్తిభావం, ‘వస్తానంటివో పోతానంటివో వగలు పలుకుతావే’, ‘కట్టమీద పోయే అలకల సిలకా భలేగుంది బాలా’, ‘బాగుందమ్మ.. బాగుందమ్మ ఆరుబయటా’ అనే సినీ, జానపద, సంప్రదాయ పాటలు వింటే మనసుకు ఆనందం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదే ఆ పాటలకు చిన్నారుల కోలాటం నృత్యాలు తోడైతే మనసుకు ఎంతో హాయి కలిగిస్తుంది. ఆధునికి కాలంలో తీరిక దొరికితే చాలు చేతిలో మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడుతూ కాలాన్ని వృథా చేసే వాళ్లను ఎంతో మందిని చూస్తున్నాం. వాటి వల్ల సమయం వృథాతో పాటు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ నృత్యాల వైపు చిన్నారులు మొగ్గు చూపుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్స్‌తో పాటు కోలాటం, జడకోపు నృత్యాలు నేర్పిస్తున్నారు. వీటి వల్ల పిల్లలకు ఆరోగ్యం, మానసిక స్థైర్యం కలుగుతూ రాణిస్తున్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో సుమారు 40 మంది చిన్నారులు ప్రతి రోజూ రాత్రి రెండు గంటలకు పైగా సమయం కేటాయించి కోలాటం నేర్చుకుంటున్న తీరు స్థానికులను ఆకట్టుకుంటుంది. చిన్నారుల బుజ్జి బుజ్జి స్టెప్పులు గ్రామస్తులను అలరిస్తున్నాయి.
40 రోజుల శిక్షణ
వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన ఎస్.శివరామిరెడ్డి చిన్నారులతో పాటు పెద్దలకు కోలాటం నృత్యం నేర్పిస్తున్నారు. అందులో భాగంగా బుక్కాపురం గ్రామానికి చెందిన 40 మంది చిన్నారులతో పాటు కొందరు మహిళలు కోలాటం నేర్చుకుంటున్నారు. ప్రతి రోజూ గ్రామంలోని కాశినాయన ఆలయం వద్ద రాత్రి రెండు గంటల పాటు కోలాటం సాధన చేస్తారు. కోలాటంతో పాటు ఇటీవల ప్రాచుర్యం పొందిన జడకోపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సమయం దొరికితే టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయే తమ పిల్లలు సంప్రదాయ కోలాటం నేర్చుకోవడం ఆనందం కలిగిస్తుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు రెండు చేతులతో కోలాటం కర్రలు పట్టుకొని లయ, సంగీతానికి అనుగుణంగా ఏకకాలంలో కర్రల శబ్ధం చేస్తూ నృత్యం చేస్తుండటం కనువిందుగా ఉందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
గ్రామాల్లో చిన్నారులు, మహిళల ఆసక్తి
40 రోజుల పాటు శిక్షణ
కోలాటం, జడకోపు వైపు మొగ్గు
అంతరించిపోతున్న కళలకు ప్రాణం
మొదట్లో భయం.. ఇప్పుడు ఆనందం
ప్రతి రోజూ రాత్రి రెండు గంటల పాటు సమయం కేటాయించి కోలాటం నేర్పిస్తున్నారు. మంచి దేవుడి పాటలకు కోలాటం నృత్యం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ, నాన్నల సహకారంతో గురువు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో కోలాటం నేర్చుకుంటున్నాను. మొదట్లో కాస్త భయం, బిడియం ఉండేది. ఇప్పుడు కోలాటం నృత్యం బాగా చేస్తున్నాను.
– కె.ష్ణవి, ఐదో తరగతి
కోలాటం నేర్పుతూ ఉపాధి
గత కొన్నేళ్లుగా కోలాటం, జడకోపు నేర్చుకున్నాను. పండుగలు, జాతరలు, ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి ప్రదర్శనలు ఇస్తాము. ఇటీవల సంప్రదాయ నృత్యాలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 1200 మందికి కోలాటం నేర్పించాను. గ్రూపులో 40 మంది సభ్యులు ఉంటే కోలాటం నేర్పిస్తాను. ఇదే కోలాటం నృత్యం మా లాంటి ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా 96769 95547 సంప్రదించవచ్చు. – ఎస్.శివరామిరెడ్డి, బోయరేవుల

కోలాటం.. సంబరం

కోలాటం.. సంబరం

కోలాటం.. సంబరం