
అహోబిలేశుడి సేవలో జైళ్ల శాఖ డీజీపీ
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహ స్వామివార్లను జైళ్ల శాఖ డీజీపీ అంజనీకుమార్ బుధవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదల్లో భాగంగా ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అహోబిలం క్షేత్రంలోని లక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు.
రేపు అథ్లెటిక్స్
ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్‌డోర్ స్టేడియంలో ఆగస్టు 1న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్బరత్నాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులు వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని వివరాలకు 89194 09232 సెల్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య
కోవెలకుంట్ల: పట్టణంలోని నాగులకట్ట వీధిలో నివాసం ఉంటున్న పవన్‌నాయక్ (25) అనే యువకుడు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బుధవారం ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లితండాకు చెందిన పవన్‌నాయక్ పట్టణంలోని శ్రీరాంచిట్స్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసవ నిమిత్తం పుట్టింటికి వెళ్లిన భార్య ఇరవై రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ కలహాలతో పవన్‌కుమార్ విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి సోదరుడు బాలస్వామినాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఎట్టకేలకు చిక్కిన కొండముచ్చు
ప్యాపిలి: జలదుర్గం గ్రామంలో గత వారం రోజులుగా హడలెత్తించిన కొండముచ్చు ఎట్టకేలకు పట్టుబడింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ నాగమనేశ్వరి రెస్క్యూ టీం వారిని రప్పించారు. రాత్రి 10 గంటల సమయంలో చెట్టుపై ఉన్న కొండముచ్చును గుర్తించిన రెస్క్యూ టీం, అటవీశాఖ అధికారులు చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికే కొండముచ్చు చెట్టుపై నుంచి కిందపడింది. వెంటనే బోనులో బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. దాదాపు 20 మందిని కరిచిన కొండముచ్చు కథ సుఖాంతం కావడంతో జలదుర్గం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గ్రామంలో మరో కొండముచ్చు ప్రజలపై దాడి చేసి గాయపర్చినట్లు గురువారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని ఖండించారు. అనవసరంగా వదంతులు సృష్టిస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అహోబిలేశుడి సేవలో జైళ్ల శాఖ డీజీపీ