
జవానుకు అశ్రునివాళి
చాగలమర్రి: మండలంలోని పెద్దవంగలి గ్రామానికి చెందిన జవాను పోతినేని అశోక్‌కుమార్ భౌతిక కాయానికి బుధవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. ఆయన శ్రీనగర్‌లోని అనంతనాగ్‌లో ప్రత్యేక దళంలో ఎస్‌పీఆర్ ర్యాంకులో జవానుగా విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం విదితమే. ఆయన భౌతిక కాయం బుధవారం ఉదయం చాగలమర్రికి చేరుకోగా మండల ప్రజలు స్థానిక టోల్‌ప్లాజా నుంచి మోటార్ సైకిళ్లపై జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీగా స్వగ్రామమైన పెద్దవంగలికి తీసుకొచ్చారు. మృతదేహం ఇంటి వద్దకు చేరుకోగానే తల్లిదండ్రులైన పోతినేని శేఖర్, రామలక్ష్మీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. తండ్రి పోతినేని శేఖర్ ఆర్మీలో పనిచేస్తుండగానే కుమారుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. అనంతరం 203 ఇంజినీరింగ్ రెజిమేంట్‌కు చెందిన సుబేదార్ ఎం.కె.రెడ్డి, హవల్దార్ దర్గారెడ్డి, ఏపీఆర్ శుభాష్, అలాగే 30(ఏ) ఎన్‌సీసీ బీఎన్ కడప జిల్లాకు చెందిన సూబేదార్ సునిల్‌మాలిక్, హవల్దార్ సీఎల్ రెడ్డి, వీకే చైతన్య జవాను భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి వందనాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక దళ సిబ్బందిచే అంతిమ యాత్ర చేపట్టారు. శ్మశాన వాటికలో మృతదేహంపై జాతీయ జెండాను కప్పి గౌరవ వందనాలు సమర్పించారు. స్థానిక ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఏఆర్ ఏఎస్‌ఐ మూర్తితో పాటు ఐదుగురు సిబ్బంది పాల్గొని పరేడ్ నిర్వహించి గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

జవానుకు అశ్రునివాళి