
అట్టహాసంగా సీపీఐ జిల్లా మహా సభలు
డోన్ టౌన్: డోన్ పట్టణంలో బుధవారం సీపీఐ నంద్యాల జిల్లా రెండవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు డప్పు, కోళాటం, ప్రజా నాట్యమండలి కళాకారులతో నృత్య ప్రదర్శనలు, జానపద గేయాలతో వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు ఎర్రదుస్తులు, జెండాలతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీపీఐ జెండా తోరణాలతో పట్టణం ఎరుపు మయంగా మారింది. అనంతరం బుగ్గన మార్గ్‌లోని రైల్వే స్టేషన్ వంద అడుగుల రోడ్డులో బహిరంగ సమావేశం నిర్వహించారు.
11 ఏళ్ల పాలనలో మోదీ చేసింది శూన్యం
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనల్లో ప్రజలకు చేసింది శూన్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులను ఆదుకుంటానని చెప్పి విస్మరించారన్నారు. గణాంకాల ప్రకారం 55 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధర, ఉద్యోగాల కల్పన, బ్లాక్ మనీ వెనక్కు తెప్పిస్తామని చెప్పడం అన్నీ బూటకమని విమర్శించారు.
సీఎం సింగపూర్‌లో.. డీసీఎం సినిమాల్లో..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరమల్లు సినిమా పనుల్లో బీజీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో లేనప్పుడు కమ్యూనిస్టు పార్టీ చెప్పిన సిద్దాంతాలు నిజం అంటూ గెలిచిన తరువాత సింగపూర్, డల్లాస్, లండన్ పర్యటనలు తప్పా చేసింది ఏమి లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ డబుల్ అప్పులు చేశారని దుయ్యబట్టారు. ఏడాది పాలనలో 21 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశారని, రైతులకు నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న సీపీఐ వంద వసంతాలు పూర్తి చేసుకుందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రామచంద్రయ్య, భీమలింగప్ప, బాబా ఫకృద్ధీన్, నబిరసూల్, అవులశేఖర్, రజిత, లక్ష్మీదేవి, జిల్లా నాయకులు సుంకయ్య, రాధకృష్ణ, ప్రభాకర్ తదితరులు