
విద్యుత్ సమస్యలతో పరేషాన్
బనగానపల్లె: పట్టణ సమీపంలోని రవ్వలకొండపై ఉన్న ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. తరచుగా నెలకొంటున్న విద్యుత్ సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు వంద మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్నారు. మోడల్ స్కూల్ పక్కనున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి సుమారు 120 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ కేబుల్ వైర్ ద్వారా హాస్టల్‌కు విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. భూమి లోపలి భాగంలో వైర్ తరచూ పాడైపోతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో హాస్టల్‌లోని విద్యార్థినులు అంధకారంలో ఉండాల్సి వస్తోంది. ఇటీవల 15 రోజుల పాటు విద్యుత్ సరఫరా లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత నేలను తవ్వి కేబుల్ వైర్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ పరిస్థితులు ఎన్నాళ్లంటూ విద్యార్థినుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే విద్యుత్ లోఓల్టేజీ, హైఓల్టేజీ వల్ల హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లు పాడైపోయాయి. వీటిని రిపేరుకు ఇచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ నెల 23న ఇక్కడి హాస్టల్ వార్డెన్‌ను వెలుగోడుకు బదిలీ చేయగా, ఇక్కడికి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఇక్కడ పనిచేసే ట్యూటరే పగలు, రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామలక్ష్మిని వివరణ కోరగా బాలికల హాస్టల్‌కు విద్యుత్ సమస్య ఉన్నది వాస్తవమేనన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి హాస్టల్ వరకు స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారుల ఎస్టిమేషన్ మేరకు రూ.2 లక్షల నిధులు మంజురయ్యాయి. ఈ నిధులు క్రెడిట్ కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల
ఇక్కట్లు
అండర్ గ్రౌండ్ కేబుల్ కావడంతో
మరమ్మతుల్లో తీవ్ర జాప్యం