
హత్యకేసు నిందితుడికి జీవితఖైదు
నంద్యాల(వ్యవసాయం): బనగానపల్లెకు చెందిన న్యాయవాది హత్యకేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ బుధవారం తీర్పు వెల్లడించారని మహానంది పోలీసులు తెలిపారు. 2018లో న్యాయవాది బసవరాజు హత్యకేసులో నలుగురి ప్రమేయం ఉండగా మొదటి వ్యక్తి అనారోగ్యంతో హాజరు కాకపోవడం, నాలుగో వ్యక్తి చనిపోవడంతో మిగిలిన రెండవ నిందితుడు నాగరాజుకు జీవితకాలం జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా, మూడో నిందితుడు నాగేంద్రకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. న్యాయవాది బసవరాజుకు ఒక కేసు విషయంలో బొడ్డు సుజాత అనే మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నేళ్లకు వారి మధ్య సంబంధం బెడిసికొట్టింది. ఈ క్రమంలో 2015లో సుజాత నంద్యాలకు వెళ్దామని బసవరాజును పిలిపించగా బనగానపల్లె నుంచి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో పాణ్యం వద్ద నాగరాజు సాయంతో కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించడంతో బసవరాజు మృతి చెందాడు. అదే కారులో నంద్యాలకు వచ్చి బి.కోడూరుకు చెందిన నాగేంద్ర సాయంతో మహానంది మండలం గోపవరం సమీపంలో మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటనపై మరుసటి రోజు వీఆర్‌ఓకు సమాచారం అందడంతో మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసు బుధవారం తుది విచారణకు రాగా జడ్జి విచారణ జరిపి నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు.
సహకరించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష