
భర్త చేతిలో భార్య హతం
కోసిగి: మండల పరిధిలోని చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బోయ దుద్ది రామలక్ష్మి (45)ను ఆమె భర్త నరసింహులు రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రామలక్ష్మి దంపతులు పిల్లలతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లి జీవనం సాగించేవారు. నరసింహులకు కొద్దికాలంగా ఆరోగ్యం, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇటీవల మొహర్రం పండుగకు గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. క్రమంగా నరసింహులు పరిస్థితి దిగజారి ఇతరులతో మతిస్థిమితం లేకుండా ప్రవర్తించేవాడు. ఈ స్థితిలో బుధవారం సాయంత్రం రామలక్ష్మి ఇంటి ముందు వంట పాత్రలు తోముతుండగా నరసింహులు వెనుక నుంచి వచ్చి ఇంట్లో ఉన్న రోకలి బండతో తలపై కొట్టాడు. ఆమె తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు పరిక్షించేలోపే ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
ఆదోని రూరల్: మండలంలోని పాండవగల్లు–కుప్పగల్లు గ్రామాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి మండలం కురువళ్లికి చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మి దంపతులు గాయపడ్డారు. వారు బైకుపై మంత్రాలయం మండలం సింగరాజనపల్లికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వెనుక నుంచి తాకడంతో బైకు లారీని ఢీకొట్టి కింద పడ్డారు. ప్రమాదంలో భార్యాభర్తలిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆటోలో నుంచి కింద పడి..: మండలంలోని బైచిగేరి వద్ద ఆటోలో వెళ్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజు తాకూర్ ఆటోలో నుంచి కింద పడి గాయపడినట్లు తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు బుధవారం తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.