
విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే గుణపాఠం తప్పదు
ఓర్వకల్లు: పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్‌సీపీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ హెచ్చరించారు. పార్టీ ఆదేశాల మేరకు ‘సంక్షేమ హాస్టళ్ల బాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలోని వసతి గృహాన్ని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులతో కలసి ఆయన సందర్శించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేవన్నారు. పలు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్లు కరోనా పోగా, మిగతా మూడేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారన్నారు. నాడు–నేడుతో శాశ్వత పరిష్కారం చూపారని గుర్తుచేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయు డు గొప్పలు చెప్పుకోవడమే గానీ విద్యార్థులను పట్టించుకొన్న పాపాన పోలేదని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు సకాలంలో అందేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏమి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే కుట్రపన్నుతున్న కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు వుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి పాయి, జిల్లా నాయకులు తిరుమలేష్, కర్నూలు మండల అధ్యక్షులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.