
ఫేక్ ట్రైనర్ కుచ్చు టోపి
● స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరుతో
విద్యార్థులను మోసం చేసిన వైనం
ఆలూరు: స్కౌట్‌ను నేర్పించేందుకు తనను ప్రభుత్వం నియమించిందని ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒక ఫేక్ ట్రైనర్ బురిడీ కొట్టించాడు. అరికెర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలురు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి నగదు వసూళ్లు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో దాదాపు 548 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్‌సీసీ శిక్షణకు తనను ప్రభుత్వం నియమించిందని ఐదు రోజుల క్రితం రాజు అనే వ్యక్తి పాఠశాలకు చేరుకున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికా రులు నియమాకపత్రం ఇచ్చినట్లు ఫేక్ పత్రాలు చూయించి పాఠశాలలో చేరాడు. అయితే శిక్షణ ఇస్తూ విద్యార్థుల నుంచి దరఖాస్తు ఫీజు రూ. 460, డ్రస్‌కు రూ. 2,500.. ఇలా దాదాపు 30 మంది నుంచి నగదు వసూలు చేశాడు. ఈ విషయంపై ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అతను ఫేక్ ట్రైనర్ అని వెలుగు చూసింది. రెండు రోజులు నుంచి అతను పాఠశాలకు రావడం లేదు. ఈ విషయంపై ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహులను సాక్షి వివరణ కోరగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేస్తున్నారన్నారు.