వికసించని ‘ఉద్యాన’ సాగు | - | Sakshi
Sakshi News home page

వికసించని ‘ఉద్యాన’ సాగు

Jul 29 2025 8:14 AM | Updated on Jul 29 2025 8:14 AM

వికసించని ‘ఉద్యాన’ సాగు

వికసించని ‘ఉద్యాన’ సాగు

2019–20 నుంచి 2024–25 వరకు

ఉద్యాన పంటల సాగు, ఉత్పాదకత వివరాలు..

సంవత్సరం ఉద్యానపంటల సాగు ఉద్యానపంటల ఉత్పాదకత

(హెక్టార్లలో) (టన్నుల్లో)

2019-20 1,17,889 20,55,819

2020-21 1,11,919 19,28,549

2021-22 1,04,733 17,64,261

2022-23 91,059 11,36,950

2023-24 90,780 6,01,228

(ఈ ఏడాది కరువు)

2024-25 71,630 7,83,552

ప్రోత్సాహకాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

2023–24లో కరువు వచ్చినప్పటికీ

90,780 హెక్టార్లలో సాగు

కూటమి ప్రభుత్వం వచ్చాక 71,630

హెక్టార్లకు పడిపోయిన వైనం

20.55 లక్షల నుంచి 7.83 లక్షల

టన్నులకు తగ్గిన ఉత్పాదకత

క్షేత్రస్థాయిలో కనిపించని

పండ్లతోటల అభివృద్ధి

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ఉద్యాన పంటల సాగు వికసించడం లేదు. మామిడి, అరటి, జామ, సపోట, చినీ, నిమ్మ, దానిమ్మ, మల్లె, సన్నజాజి, మునగ తదితర పంటలు సాగు క్రమంగా తగ్గుతోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెంచేందుకు ఉద్యాన పంటలు కీలకపాత్ర వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉద్యాన పంటల సాగు పురోగమనంలో ఉండి, ఉత్పాదకత భారీగా వచ్చేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉద్యాన పంటల సాగు తిరోగమనం అయ్యింది. ఉత్పాదకత కూడా డీలాపడిపోయింది.

వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలా..

కర్నూలు జిల్లాలో 2019–20 నుంచి 2023–24 వరకు ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. 2023–24లో వర్షాభావ పరిస్థితులతో కరువు ఏర్పడినా ఉత్పాదకత తగ్గలేదు. గత వైఎసార్‌సీపీ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించింది. ‘ఉపాధి’ నిధులతో 100 శాతం సబ్సిడీతో పండ్లతోటల అభివృద్ధికి అవకాశం కల్పించింది. సుగంధద్రవ్యాల పంట ఉత్పత్తులకు రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. వర్షాలు ఆశాజనకంగా పడటం, ప్రతి ఏటా హంద్రీ–నీవా కాలువకు నీరు రావడంతో ఉద్యాన పంటల సాగు భారీగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 1,17,889 హెక్టార్లలో పంటలు సాగు కాగా... ఉత్పాదతక 20.55 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. 2023–24లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో కరువు మండలాలను ప్రకటించినా ఉద్యాన పంటల సాగు ఆశాజనకంగానే కనిపించింది.

‘కూటమి’లో సబ్సిడీలకు సున్నా!

కూటమి ప్రభుత్వ ఆధినేత నారాచంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం అంటూ మాటల్లో తప్ప చేతల్లో చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2024–25లో ఉద్యాన పంటల సాగు పడిపోవడాన్నే చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం, ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో సాగుపై రైతుల్లో విముఖత ఏర్పడింది. జిల్లాలో ప్రధాన ఉద్యాన పంటలైన మామిడి, అరటి సాగు తగ్గిపోయంది. జామ, సపోట, చినీ, నిమ్మ తదితర పంటలు సాగు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లాలో 2023–24లో 90,780 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యాయి. అయితే 2024–25లో మాత్రం సాగు 71,630 హెక్టార్లకు పడిపోయింది. ఎంఐడీహెచ్‌, ఆర్‌కేవీవై కింద యాక్షన్‌ ప్లాన్‌ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2024–25లో కూరగాయల సాగుకు ఎలాంటి సబ్సిడీలు లేవు.

ఆ‘ధర’ణ లేక!

2022–23 నుంచి సుగంధ ద్రవ్యాలకు చెందిన మిర్చి పంటకు రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. ఏకంగా క్వింటాల్‌కు గరిష్టంగా రూ.53వేలకుపైగా ధర లభించింది. దీంతో 2023–24లో రికార్డు స్థాయిలో సాగు చేశారు. ఈ ఏడాది కూడా మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు లభించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లాలో మిర్చి 95 వేల ఎకరాల్లో సాగు అయ్యింది. నల్లతామర, వైరస్‌ తెగుళ్ల కారణంగా దిగుబడులు పడిపోయాయి. సాగు తగ్గి దిగుబడులు పడిపోయినప్పటికీ ధరలు అట్టడుగుకు పోయాయి. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.10 వేలు కూడా లభించిన దాఖలాలు లేవు. మద్దతు ధరతో కొంటామని ఊరించిన కూటమి ప్రభుత్వం చివరికి మిర్చి రైతులను నట్టేట ముంచింది.

ప్ర‘గతి’ తప్పి!

వేలాది ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. ఇందుకు ఈ–క్రాప్‌లో నమోదవున్న లెక్కలే నిదర్శనం. 2023–24లో ఈ–క్రాప్‌ ప్రకారం 4,155 హెక్టార్ల(10,387ఎకరాలు)లో పండ్లతోటలు ఉన్నాయి. 2024–25లో ఉపాధి నిధులతో 4,150 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు లెక్కలు ఉన్నాయి. 2024–25లో ఉద్యాన శాఖ కూడా 1,000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేసినట్లు చెబుతోంది. ఈ ప్రకారం 2024–25లో పండ్లతోటల సాగు భారీగా పెరగాలి. ఈ–క్రాప్‌ ప్రకారం 2024–25లో (4660 హెక్టార్ల(11650 ఎకరాలు)లో పండ్లతోటల సాగు ఉన్నట్లు తేలింది. 2023–24తో పోలిస్తే 2024–25లో కేవలం 505 హెక్టార్ల(1262 ఎకరాలు)లో మాత్రమే పండ్లతోటల సాగు పెరిగింది. ఉపాధి నిధులతో చేపడుతున్న పండ్లతోటల సాగు ఆన్‌లైన్‌లో మాత్రమే కనిపిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement