రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు! | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!

Jul 29 2025 8:14 AM | Updated on Jul 29 2025 8:14 AM

రోడ్డ

రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!

ఆత్మకూరు: పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళల కోసం ఉచిత బస్సులను నడుపుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పినా మంత్రులతో, టీడీపీ నేతలతో రకరకాల వ్యాఖ్యాలు చేయిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వరకే పరిమితం అనే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు లేవని, మహిళలకు ఉచిత బస్సు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమవుతుందని టీడీపీ అనూకూల మీడియాలు వార్తా కథనాలు ప్రచురిస్తూ రకరకాల అపోహలను సృష్టిస్తున్నాయి. దీంతో మహిళలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచిత హామీ ఇవ్వడం ఎందుకు.. అధికారంలోకి వచ్చాక ఆలస్యం చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

జిల్లాకే పరిమితం అయితే ఇవీ కష్టాలు..

ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం చేస్తామని చేస్తున్న ప్రకటనలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● నంద్యాలకు చెందిన బ్రాహ్మణకొట్కూరు గ్రామం నుంచి కర్నూలు జిల్లా పరిధిలోని గార్గేయపురం గ్రామానికి వెళ్లాలంటే కేవలం ఆరు కి.మీ. దూరం మాత్రమే ఉంది. దాదాపు టికెట్‌ రూ.10 ఉంది. ఈ మార్గంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదు.

● బ్రాహ్మణకొట్కూరు మహిళలు కర్నూలుకు వెళ్లాలంటే చార్జీ చెల్లించాలి. కేవలం కర్నూలు 15 కి.మీ. దూరంలో ఉన్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కరువే.

● నంద్యాల జిల్లా పరిధిలోని ఆత్మకూరు నుంచి ప్రకాశం జిల్లాలోని దోర్నాల వెళ్లాలంటే 60 కి.మీ. దూరం ఉంది. టికెట్‌ మాత్రం రూ.120. ఆత్మకూరు నుంచి దోర్నాకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాదు.

● శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా పరిధిలోని దోర్నాల మీదుగా వెళ్లాలి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కితే కచ్చితంగా టికెట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

● నంద్యాల జిల్లా పరిధిలోని చాగలమర్రి నుంచి మైదుకూరుకు 20 కి.మీ. దూరంలోనే ఉంది. ఆర్టీసీ బస్సులో ఎక్కితే రూ.30 చార్జీ చెల్లించాల్సి ఉంది.

అన్నీ అబద్ధాలేనా?

ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లా వరకే కల్పిస్తామని చెప్పడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు అని ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయితో ఉచిత బస్సు సర్వీసు కల్పిస్తే మహానంది, శ్రీశైలం, అహోబిలం, ద్రాక్షారామం, అన్నవరం, తిరుమల, శ్రీకాళహస్తి, మంత్రాలయం దర్శించుకోవచ్చని, భక్తిభావం పెరుగుతుందని మహిళలు చెబుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరగేవిధంగా జీవో ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకే కాకుండా సూపర్‌ లగ్జరీ, నాన్‌ఏసీ బస్సుల్లో కూడా మహిళలే ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 20 నుంచి 30 వేల మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

అమలు చేస్తారో లేదో

అధికారం కోసం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి యేడాదిన్నర్ర అయినా ఇంతవరకు ఊసే లేదు. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తారో లేదో చూడాలి – దర్గమ్మ, ఆత్మకూరు

మోసగించడం సరికాదు

ఉచిత బస్సు సర్వీసు పేరుతో కూటమి ప్రభుత్వం ఆశ కల్పించింది. ఇప్పుడు నిబంధనలు విధించడం సరికాదు. సొంత జిల్లాకే ప్రయాణం సరిచేస్తే చాలా కష్టాలు వస్తాయి. ఇలా చేస్తే కూటమి ప్రభుత్వం మహిళలను మోసగించినట్లు అవుతుంది. ఇప్పటికై నా ఉచిత బస్సు హామీని రాష్ట్రమంతా అమలు చేయాలి. – పార్వతి, ఆత్మకూరు

ఇప్పటి వరకు అమలు కాని

చంద్రబాబు హామీ

ఆగస్టు 15న అమలు చేస్తామని

ఆర్భాట ప్రకటన

జిల్లా వరకే పరిమితం అంటూ

ప్రచారాలు

బస్సులు లేవు.. భారమవుతుందని

అనుకూల మీడియాలో ప్రచారం

రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!1
1/2

రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!

రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!2
2/2

రోడ్డెక్కని మహిళల ఉచిత బస్సు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement