
బాబోయ్.. కొండముచ్చులు
ప్యాపిలి: జలదుర్గం గ్రామ ప్రజలకు గత వారం రోజులుగా కంటి మీద కునుకు కరువైంది. గత కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారు ప్రాంతంలో కొండముచ్చు కోతులను వదిలి వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి గ్రామంలోకి వచ్చిన కోతులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ గుంపులోని ఓ కొండముచ్చు కోతి పగలు, రాత్రి అని తేడా లేకుండా గ్రామస్తులపై దాడికి పాల్పడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా ఈ కొండముచ్చు బారిన పడి గాయపడ్డారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన కొండ ముచ్చు గాఢనిద్రలో ఉన్న మీనిగ లక్ష్మీదేవి అనే మహిళ తలపై కరిచింది. దీంతో ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొండముచ్చు ఆగడాలతో గ్రామస్తులు ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులపై కూడా కొండముచ్చులు దాడి చేయడంతో గత రెండు రోజులుగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. కొండముచ్చుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటికి తలుపులు వేసుకుని గ్రామస్తులు ఇళ్లలోనే బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.
బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు
గత వారం రోజులుగా జలదుర్గం గ్రామంలో కొండముచ్చు మూక స్వైర విహారం చేస్తుండటంతో ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు స్పందించారు. పలు చోట్లు బోన్లు, వలలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కొండముచ్చు కూడా బోన్‌లో చిక్కలేదు. కాగా అధికారులు సోషల్ మీడియా, దండోరా ద్వారా గ్రామస్తులను అప్రమత్తం చేశారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటే తగు జాగ్రత్తలతోనే బయటకు రావాలన్నారు. రాత్రి వేళల్లో మిద్దెలపై, ఆరు బయట నిద్రించకూడదన్నారు. బజార్లలో గుంపులుగా గుమికూడదని వీఆర్‌ఓ సునీల్ ప్రజలను అప్రమత్తం చేశారు. చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపరాదన్నారు.
జలదుర్గంలో ఆగని
కొండముచ్చు దాడులు
బయటకు వచ్చేందుకు జంకుతున్న
గ్రామస్తులు
బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ
అధికారులు