
ఆకతాయిలపై డ్రోన్ నిఘా
కర్నూలు: కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడే ఆకతాయిలపై నిఘా కోసం పోలీసులు డ్రోన్ కెమెరా సేవలను వినియోగిస్తున్నారు. సోమవారం నగరంలోని ఆర్‌ఎస్ రోడ్డులో ఉన్న కేవీఆర్ కళాశాల, మౌర్యా ఇన్ వద్ద ఉన్న చైతన్య కళాశాల సమీపంలో ఆకతాయిల ఆట కట్టించేందుకు శక్తి టీమ్ పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా పటిష్టం చేశారు. శక్తి టీమ్ సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు భద్రతపై భరోసా కల్పిస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే పోలీసు బృందాలతో విద్యాసంస్థల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సుంకేసులను
సందర్శించిన ఎస్‌ఈ
కర్నూలు (సిటీ): టీబీ డ్యాం నుంచి విడుదల చేస్తున్న 1.19 లక్షల క్యూసెక్కుల నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుకుంటోంది. దీంతో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్‌ఈ) బాలచంద్రారెడ్డి సోమవారం సుంకేసులను సందర్శించారు. బ్యారేజీకి వస్తున్న ఇన్‌ఫ్లో, బయటకు వదులుతున్న ఔట్‌ఫ్లో వివరాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని ఇంజినీర్లకు సూచించారు. బ్యారేజీ నుంచి 1,03,437 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.